Dr. Y.S.Rajashekhar Reddy

Tag: dr ksr

Dr.Krishna gaari experience – DrYSR!

by donny on Dec.22, 2009, under Incidents

అది 2004వ సంవత్సరం. ఎన్నికల సమయం. అప్పుడప్పుడే మెడిసిన్ పూర్తి చేసి హౌస్ సర్జన్ గా ట్రైనింగ్ తీసుకుంటూ పేద ప్రజలకి ఏదో సాయం చేసెయ్యాలని ఆత్రుత గా హాస్పిటల్ లో అడుగు పెట్టిన సందర్భం ! ముఖ్యమంత్రి గా చంద్రబాబు చక్రం తిప్పుతున్న కాలం!! సంపూర్ణ మద్య నిషేధం, రెండు రూపాయలకి కిలో బియ్యం పథకాలని సమర్థవంతం గా అటకెక్కించి, విద్యుత్ చార్జీలని ఎడా పెడా పెంచేసి, సామాన్య ప్రజల నడ్డి విరిచే అన్ని రకాలైన దుర్మార్గపు ఆలోచనలు ఐపోయిన తరువాత బకాసురుడి లాగా అసలే రోగాలతో అల్లాడిపోయే  పేషంట్స్ మీద పడి యూజర్ చార్జెస్ పేరిట ఓ.పీ టికెట్స్ రెండు రూపాయలు,ఎక్స్ -రే 50 రూపాయలు , బ్లడ్ టెస్ట్స్ 100 ఇలా…..పరీక్ష కో రేట్ పెట్టి జలగ లాగా పీడించుకు తినే దౌర్భాగ్య స్థితి అది.
కొంత మంది పేషంట్స్ రెండు రూపాయలు కూడా వారి దగ్గర లేక డైరెక్ట్ గా ఓ.పీ లోకి వచ్చేస్తే మా హౌస్ సర్జన్స్ లోనే ఎవరో ఒకరు సాయం చేసిన సందర్భాలు కోకొల్లలు!!! అంతే కాక లైబ్రరీ లో మంచి ఙ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు లేక అడిగితే పట్టించుకునే దిక్కు లేక మేము పడిన బాధలు వర్ణనాతీతం…
ఇక ప్రమాణాలకి తగిన వసతులు లేకున్నా , అవినీతి కి పాల్పడి ( ‘ముఖ్య మంత్రి స్థాయి లోనే ) మెడికల్ కాలేజీ లకి పర్మిషన్స్ ఇచ్చిన విషయాలు చెప్పుకుంటే సిగ్గు చేటు….
ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్క మాట లో చెప్పాలంటే ‘ఆరోగ్య శాఖ ‘ తీవ్రమైన అనారోగ్యం తో పడకెక్కిన ఒక అసాధారణ సమయం!
ఈ తరుణం లో వైద్య ఆరోగ్య వ్యవస్థ లో కొన్ని మార్పులు కోరుతూ జూనియర్ డాక్టర్స్ చేసిన సమ్మె న భూతో న భవిష్యతి! 43 రోజుల పాటూ ఏక బిగిన కొన సాగిన ఆ సమ్మె లో ఎన్నో ప్రజా సంఘాలూ, విద్యార్థి సంఘాలూ, రాజకీయ పార్టీ లు పాల్గొని గొంతు చించుకుని అరిచినా మన దున్నపోతు బాబు కి చీమ కుట్టినట్టైనా లేకపోయింది.
ఒక రోజు మేము నిరాహార దీక్షా శిబిరం లో ఉండగా అప్పుడొచ్చాడు అక్కడికి ఒక తెల్లని పంచె కట్టు లో, ముఖం మీద చెరగని చిరు నవ్వు తో, మిన్ను విరిగి మీద పడినా చలించను అనేంత  ఆత్మ స్థైర్యం అడుగడుగునా తొణికిసలాడుతూండగా ఒక స్ఫురద్రూపి- ఆనాటి ప్రతిపక్ష నాయకుడు..డా.వై.యస్.రాజశేఖర రెడ్డి…..రావడం రావడమే మీకు నేనండ గా ఉంటానంటూ…భుజం మీద చేయి వేసి ఆప్యాయం గా పలకరిస్తూ ” మన ప్రభుత్వం రాగానే ఏ ఒక్క పేద వాడూ డబ్బులు లేని కారణం గా వైద్యం చేయించుకోలేక పోయాను అని బాధ పడకుండా చూసే బాధ్యత నాదీ” అంటూ మా అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
చెబితే నమ్మరు కాని సమాజం లో అతి పవిత్రమైన బాధ్యతలని నిర్వర్తించే వైద్యులని జైలు లో పెట్టించిన దుర్మార్గుడు ఒకరైతే ( నేను కూడా ఒక రోజంతా పోలీసుల నిర్బంధం లో గడిపాను…నేనేనేమిటి? రాష్ట్ర వ్యాప్తం గా మా జూనియర్ డాక్టర్స్ అందరిని నిర్బంధించారు ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో  )
అధికారం లోకి రాగానే మాట తప్పకుండా యూజర్ చార్జెస్ ని మొత్తం గా తీసేస్తూ ,మెడికల్ కాలేజెస్ లో అధునాతన వసతి సౌకర్యాలు కలిగిస్తూ ( పుస్తకాల వంటివి) , ఇవ్వని హామీ ఐన -మేమెవ్వరమూ అడగకున్నా జూనియర్ డాక్టర్స్ స్టయిపెండ్ పెంచడం వంటి అనేకమైన చర్యలని తీసుకున్న పుణ్యాత్ముడు వై.యస్.ఆర్ !!!
ఈనాటి ‘ఆరోగ్య శ్రీ ‘ పథకానికి ఆనాటి మా దీక్షా శిబిరం లోనే అంకురార్పణ జరిగిందేమో అని తలుచుకుంటే నా సంతోషానికి అవధులుండవు…
పుణ్యాత్ములంటే దేవుడికి కూడా చాల ఇష్టం అంటారు…అందుకేనేమో ఇంత త్వరగా తన దగ్గరికి పిలిపించుకున్నాడు….ఆ మహనీయుని పవిత్ర స్మృతికి ఇదే నా అశ్రు నివాళి…!!!
8 Comments :, , more...

Looking for something?

Use the form below to search the site:

Still not finding what you're looking for? Drop a comment on a post or contact us so we can take care of it!

Visit our friends!

A few highly recommended friends...